Home » , , , , , » మా గొంతు నొక్కుతున్నారు: వైఎస్‌ జగన్‌

మా గొంతు నొక్కుతున్నారు: వైఎస్‌ జగన్‌


అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. తనను అధికార పార్టీ అడ్డగోలుగా విమర్శిస్తోందని ఆరోపిస్తోన్న వైఎస్‌ జగన్‌, సభలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోంటే, దానికి స్పీకర్‌ వంతపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తమకు అవకాశం ఇవ్వకుండా చేస్తోన్న అధికార పక్షాన్ని స్పీకర్‌ కట్టడి చేయకపోవడం శోచనీయమని జగన్‌ అంటున్నారు. 

వైఎస్‌ జగన్‌ సహా, వైఎస్సార్సీపీ శాసనసభ్యులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని, అసెంబ్లీ బయట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. లేనిపోని ఆరోపణలు తనపై చేస్తున్నారనీ, గడచిన మూడు నెలల్లో జరిగిన రాజకీయ హత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక ఎదురుదాడికి దిగుతోందని జగన్‌ చెప్పుకొచ్చారు. 

సభలో ప్రతిపక్షం గొంతు నొక్కేయడం దారుణమని ఆరోపిస్తూ, అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్‌ చేసింది. అధికార పక్షం సభా నిబంధనల్ని తుంగలో తొక్కిందని, అయినా అధికార పక్షానికి స్పీకర్‌ వత్తాసు పలుకుతున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంటే, స్పీకర్‌ని వివాదాల్లోకి లాగడం తగదని అధికార పక్షం అంటోంది. 

మరోపక్క, వాకౌట్‌ చేసిన అనంతరం వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఓ శాసనసభ్యుడు మాట్లాడుతుండగా, మధ్యలో కల్పించుకుని మతిభ్రమించిన వ్యక్తిలా పూనకంతో ఊగిపోతున్నారనీ, నోటికొచ్చిన విమర్శలు తమపై చేస్తున్నారనీ, రాజకీయ హత్యలపై చర్చ జరుగుతున్నప్పుడు ఆ టాపిక్‌కి సంబంధం లేని మాటలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారనీ, అయినా స్పీకర్‌ అధికార పార్టీ శాసనసభ్యుల్ని వారించకపోవడమేంటని చెవిరెడ్డి ప్రశ్నించారు.

Tags: Assembly, Chevi Reddy Bhaskar Reddy, Jagan, TDP, YSRCP 

0 comments:

Post a Comment

Popular Posts

r