Home » » పరిటాల వర్సెస్‌ వంగవీటి.!

పరిటాల వర్సెస్‌ వంగవీటి.!


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రాజకీయ హత్యలపై చర్చ జరుగుతోంది. శాంతి భద్రతల అంశంపై చర్చ కాస్తా, రాజకీయ హత్యల వైపు మళ్ళింది. గడచిన మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోన్న దరిమిలా, చర్చ షురూ అయితే.. పదేళ్ళలో జరిగిన రాజకీయ హత్యలను తెరపైకి తెస్తోంది అధికార పక్షం. ఒక్కసారి చరిత్ర అంటూ తవ్వుకోవడం షురూ చేస్తే.. మూడు నెలలు.. మూడేళ్ళు.. పదేళ్ళు.. పాతికేళ్ళు.. ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంటాయి చర్చల్లోకి వచ్చే అంశాలు.

అలా, పరిటాల రవి హత్యోదంతం తెరపైకి వచ్చింది.. అదే సమయంలో వంగవీటి మోహనరంగా హత్యోదంతమూ చర్చనీయాంశమవుతోంది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో. పరిటాల రవి ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, వంగవీటి మోహనరంగా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ రెండు సామాజిక వర్గాలకు మధ్య రాజకీయ యుద్ధం.. అన్నట్టుగా తయారైందిప్పుడు పరిస్థితి. ఆయా సామాజిక వర్గాల్ని తమవైపుకు తిప్పుకునే దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

పరిటాల రవి హత్య రాజకీయ కోణంలోనే జరిగిందన్నది కాదనలేని వాస్తవం. అయితే దాని వెనుక ఫ్యాక్షన్‌ తగాదాలు కూడా ప్రముఖ భూమిక పోషించాయి. వంగవీటి మోహనరంగా హత్య వెనుకా రాజకీయ కారణాలున్నాయి.. తెరవెనుక ముఠా తగాదాలూ పనిచేశాయి. పరిటాల రవి హత్యోదంతం పేరు చెప్పుకుని అధికార తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలోకి నెట్టేయాలని చూస్తుండగా, వంగవీటి మోహనరంగా హత్యోదంతాన్ని చర్చకు తెచ్చే ప్రయత్నాల్లో వుంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

2014 ఎన్నికల్లో ఓ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా నిలవడంతో, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తృటిలో విజయావకాశాల్ని మిస్సయ్యిందన్నది నిర్వివాదాంశం. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే వంగవీటి మోహనరంగా. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆ సామాజిక వర్గానికి మంచి పట్టుంది.. ఆ కోణంలో ఇప్పుడు వంగవీటి మోహనరంగా హత్యోదంతాన్ని ఎంతగా హైలైట్‌ చేస్తే వైఎస్సార్సీపీకి అంతగా రాజకీయ ప్రయోజనం చేకూరుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

వాస్తవానికి కుల రాజకీయాల్ని ఎవరూ ప్రోత్సహించకూడదుగానీ, ఇప్పుడు నడుస్తున్నదే కుల రాజకీయాల ట్రెండ్‌ కావడంతో.. ఎవరూ దీన్ని పక్కన పెట్టలేకపోతున్నారు. హత్యల వెనుక రాజకీయ కోణాలుండడం.. వాటి పేరు చెప్పి కుల రాజకీయాల్ని పార్టీలకతీతంగా అందరూ రెచ్చగొడ్తుండడంతో.. ఏ ఉదంతం ఏ పార్టీకి లాభిస్తుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చకు రావడం సర్వసాధారణమైపోయింది.

ఎటూ పరిటాల రవి హత్య పేరుతో టీడీపీ రాజకీయం చేస్తోంది గనుక, వంగవీటి మోహనరంగా పేరుని వైఎస్సార్సీపీ క్యాష్‌ చేసకుంటే తద్వారా ఓ సామాజిక వర్గం దృష్టిలో మంచి మార్కులేయించుకోవచ్చన్నది వైఎస్సార్సీపీలోని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు చేస్తోన్న ప్రతిపాదన. అటు తిరిగి.. ఇటు తిరిగి.. రాజకీయ హత్యలు కాస్తా.. కుల ప్రేరేపిత హత్యల వ్యవహారంగా మారిపోయిందన్నమాట. అందుగలడిరదులేడని సందేహమువలదు.. అన్నట్టుగా.. రాజకీయం అన్నిట్లోనూ కలగలసిపోయింది మరి.!

Tags: Andhra pradesh, Assembly, Paritala Ravi, TDP, Vangaveeti Rangaa, YSRCP

0 comments:

Post a Comment

Popular Posts

r