డ్రంక్ అండ్ డ్రైవ్.. నేను కాదు మొర్రో.!
Posted by Unknown
Posted on 6:00 PM
with No comments
యంగ్ హీరోలకి నైట్ పార్టీలెక్కువైపోయాయ్.. ఆ మాటకొస్తే, నైట్ పార్టీల ట్రెండ్ అన్ని వర్గాల్నీ ఓ కుదుపు కుదిపేస్తోంది. సినీ, రాజకీయ కుటుంబాలకు చెందినవారే కాక.. సామన్యులూ నైట్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్నారిప్పుడు. సాఫ్ట్‌వేర్ రంగానికి చెందినవారికైతే నైట్ పార్టీలు సర్వసాధారణమైపోయాయని వేరే చెప్పక్కర్లేదు కదా. కానీ, ఆ నైట్ పార్టీలు ఇప్పుడు చాలామందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కారణం నైట్ పార్టీల్లో డ్రింకింగే.
డ్రింక్ చేసి, డ్రైవ్ చేసేవారి మీద పోలీసులు ప్రత్యేక నిఘా పెడ్తున్నారు.. వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. చాలాకాలంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్ని సీరియస్‌గా తీసుకుంటున్నా, ఈ మధ్య అది మరింత సీరియస్ అయ్యింది. సెలబ్రిటీలు ఎక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొందరికి జరీమానాలు.. సీరియస్‌నెస్‌ని బట్టి కోర్టులో విచారణలు.. వెరసి సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటేనే బెంబేలెత్తాల్సి వస్తోంది.
ఆ మధ్య ‘మేనేజ్’ చేయగలిగినా, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కోర్టు దాకా వెళ్తున్నారు చాలామంది సెలబ్రిటీలు. ఈ మధ్య జైలు శిక్షలు కూడా పడ్తున్న దరిమిలా.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు సెలబ్రిటీలకు షాకిస్తున్నాయి. మీడియాకి న్యూస్ అందిందంటే తమ ఇమేజ్ దెబ్బతింటుందని భయపడ్తోన్న సెలబ్రిటీలు కొంచెం జాగ్రత్తగానే వుంటున్నారు. నైట్ పార్టీల్లో మందు కొడితే, తప్పనిసరిగా డ్రైవర్ సహాయంతోనే ఇంటికి వెళ్ళాల్సి వస్తోంది. మరోపక్క, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కొన్ని పేర్లు అనూహ్యంగా తెరపైకొస్తున్నాయి. మొన్నామధ్య అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇరుక్కున్నాడన్న వార్తలొచ్చేసరికి, ‘అదంతా ఉత్తదే’ అని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా యంగ్ విలన్ అజయ్ కూడా ఇలాగే తనపై వచ్చిన వార్తలకు వివరణ ఇచ్చుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ అజయ్, మరో సినీ రచయిత తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అయితే అజయ్ అనగానే అందరికీ కుర్ర విలన్ అజయ్ గుర్తుకొచ్చాడు.
మరక మంచిదే.. అన్నట్టు, ఈ తరహా ప్రచారమూ మంచిదే. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా నిత్యం విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పోలీసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంతగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నది నిర్వివాదాంశం. ఈ తరహా కేసులకి ఎంత పాపులారిటీ వస్తే అంతగా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కి వ్యతిరేకంగా అవగాహన పెరుగుతుందని పోలీసులూ అభిప్రాయపడ్తున్నారు.
Tags: Ajay, Drunk And Drive
0 comments:
Post a Comment