రివ్యూ : అల్లుడు శీను
రేటింగ్ : 3.5/ 5
నటీనటులు : సాయి శ్రీనివాస్ ,సమంత,ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు
దర్శకత్వం : వివివినాయక్
విడుదల తేదీ : 25 జూలై 2014
భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ అగ్ర దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన చిత్రం ''అల్లుడు శీను ''. భారీ బడ్జెట్ తో భారీ సాంకేతిక నిపుణులతో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించగా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఐటెం సాంగ్ లో మెరవగా ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం ,వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ ద్రుష్టి ని ఆకర్షించిన బెల్లంకొండ కు అండగా హిట్ లభించిందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే !
కథ :అల్లుడు శీను (సాయి శ్రీనివాస్ )అతని మామ నరసింహ (ప్రకాష్ రాజ్ ) ఊర్లో వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఆ బాకీ తీర్చలేక ,వాళ్ళ నుండి దూరంగా పారిపోయి దుబాయ్ కి వెళ్లిపోదాం అనుకోని చెన్నై ట్రైన్ ఎక్కుతారు కానీ ఆ ట్రైన్ చెన్నైకి వెళ్ళకుండా హైదరాబాద్ రావడంతో అక్కడ అచ్చం తన మామ నరసింహ లా ఉండే భాయ్ (ప్రకాష్ రాజ్ ) ని చూస్తాడు అల్లుడు శీను . ఆ సిటీలో దందాలు చేసేది భాయ్ అని తెలుసుకొని అచ్చం తన మామ అలా ఉండటం తోతన మామని భాయ్ గెటప్ వేయించి చిన్న సెటిల్ మెంట్లు చేస్తాడు అల్లుడు శీను . భాయ్ పిఎ డింపుల్ (బ్రహ్మానందం ) అభిమానినని చెప్పుకుంటూ మిగతా కస్టమర్లకు వలవేసి భాయ్ పేరు చెప్పుకుంటూ దందా చేస్తున్న సమయంలో భాయ్ కూతురు అంజలి (సమంత) ని చూసి ఇష్టపడతాడు అల్లుడు శీను. అంజలి కూడా అల్లుడు శీను ని చూసి తన తండ్రి స్నేహితుడి కొడుకు రోహిత్ గా భావిస్తుంది . కానీ అల్లుడు శీను హీరోయిజం చూసి లవ్ లో పడిపోతుంది. అదే సమయంలో తన పేరు చెప్పుకుంటూ ఎవరో సెటిల్ మెంట్లు చేస్తున్నారని డబ్బులు కూడా తీసుకున్నారని అసలైన భాయ్ కి తెలియడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. నరసింహా నికి - భాయ్ కి ఉన్న సంబంధం ఏంటి ?అల్లుడు శీను ఎవరికీ అల్లుడు అయ్యాడు ..... తను ప్రేమించిన అంజలిని దక్కించుకున్నాడా లేదా ? ఆమెని దక్కించు కోవడానికి ఎన్ని ఎత్తులు వేసాడు దాని కథా కమామీసు ఏంటో తెలియాలంటే అల్లుడు శీను చూడాల్సిందే !
ప్లస్ పాయింట్స్ : అల్లుడు శీను గా టైటిల్ రోల్ పోషించిన శ్రీనివాస్ డ్యాన్స్ లో ఫైట్ లలో ఇరగదీసాడు అని చెప్పవచ్చు . కొత్త వాడ్ని అనే బెరుకు లేకుండా అన్ని సన్నివేశాలలో బాగానే చేసాడు ఐతే ఇది మొదటి చిత్రమే కాబట్టి చాలా మంది తో పోల్చితే 100పర్సెంట్ బాగా నటించి చూపాడు శీను . పాటలలో ఆ ఈజ్ పోరాట సన్నివేశాల్లో ఆ జోష్ ని చుస్తే తప్పకుండా తెలుగు తెరకు ఓ స్టార్ హీరో లభించినట్లే అని చెప్పవచ్చు . మొదటి సినిమానే భారీ చిత్రం కావడం తన మొదటి సినిమాలోనే టాప్ స్టార్స్ తో నటించడం శ్రీనివాస్ కి బాగా ఉపయోగ పడిందనే చెప్పాలి . ఇక ఈ సినిమాలో హీరో తర్వాత చెప్పుకోతగిన నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ఇలాంటి పాత్రల్లో నటించడం బ్రహ్మి కి కొట్టిన పిండి కావడంతో అలవోకగా చేసాడు . బ్రహ్మి తెరమీదున్నంత సేపు నవ్వుల పువ్వులు పూసాయి . ఇక ప్రకాష్ రాజ్ రెండు భిన్న ద్రువాలున్న పాత్రలను పోషించారు. ఆ రెండింటిలో పెద్దగా వైవిద్యం చూపించక పోయినా సమంత తో చేసిన సెంటిమెంట్ సీన్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సమంత తొలిసారిగా అందాలను విచ్చలవిడిగా ఆరబోసి ప్రేక్షకులకు బాగానే పసందును అందించింది. చాలా సన్నివేశాల్లో బోల్డ్ గా నటించి వేడిని పుట్టించింది . ఇక మిగిలిన పాత్రల్లో ప్రదీప్ రావత్ ,వెన్నెల కిషోర్ ,రఘుబాబు తదితరులు తమతమ పత్రాల పరిధి మేరకు నటించారు . ఇక ఈ సినిమాలో కొస మెరుపు ఏంటంటే మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఐటెం సాంగ్ లో మెరిసి అందాలతో కనువిందు చేసింది.
మైనస్ పాయింట్స్ :మైనస్ పాయింట్ల లో మొదటగా చెప్పుకోవాల్సింది కథ ,ఇది పాత చింతకాయ పచ్చడే ఐతే దానికి మరిన్ని మెరుగులను కథనం రూపంలో అందించాల్సి ఉండే కానీ కథనంలో కూడా అక్కడక్కడ వేగం మందగించడం తో కాస్త నీరసం ఆవహిస్తుంది. కథ ఏంటో దాని పర్యవసానం ఏంటో ముందే తెలియడం దానికి తోడూ చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలు వస్తుండటం తో కొత్తదనం లేకుండా పోయి ఈజీగా ఏం జరుగుతుందో తర్వాతి సన్నివేశాలు ఏంటో తెలిసి పోతుంది .
సాంకేతిక వర్గం :ఈ విభాగం లోనే కాకుండా సినిమా మొత్తంలో మొట్ట మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి చోటా కే నాయుడు . అద్భుతమైన తన కెమెరా పనితనం తో ప్రతీ ఫ్రేం ని చాలా రిచ్ గా చూపించాడు. ఇక పాటలను ప్రేక్షకులకు ఇంత అందంగా చుపించాదంటే అతను ఎంతగా ఈ సినిమాలో మమేకం అయ్యాడో యిట్టె చెప్పెయ్యొచ్చు . చిత్ర నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతీ పైసా ని విజువల్ గా చూపించాడు చోటా . ఈ సినిమాకి పాటలు మరింత అందాన్ని ఇచ్చాయి . ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పాటలకు అద్భుతమైన ట్యూన్ లను ఇచ్చి సక్సేసయ్యాడు ,పాటలన్నీ జనరంజకంగా రూపొందాయి ఐతే దేవి రీ రికార్డింగ్ లో మాత్రం కాస్త డిజప్పాయింట్ చేసాడనే చెప్పాలి . ఎడిటర్ గౌతం రాజు తన పరిధి మేరకు కత్తెరకు బాగానే పని కల్పించి చూపాడు . కథ స్క్రీన్ ప్లే ని పక్కన పెడితే దర్శకుడిగా మాత్రం వినాయక్ సక్సెస్ అయ్యాడు . మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు కావడంతో ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ సక్సెస్ కోసం ఇలానే తీయాలి అని ఫిక్స్ అయి చేసినట్లుంది మొత్తానికి కొత్త కుర్రాడైనప్పటికి ఇచ్చిన మాట కోసం తనని దర్శకుడిని చేసిన నిర్మాత కొడుకు ని హీరోని చేసి తన సత్తా నిరూపించాడు వినాయక్ . ఇక నిర్మాణం గురించి చెప్పాల్సి వస్తే బెల్లంకొండ తన తనయుడు బంగారుకొండ ని హీరోగా నిలబెట్టడానికి తన దగ్గర ఉన్న కొండంత సొమ్ముని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టి నిర్మించాడు ఈ చిత్రాన్ని . అతని నిర్మాణ దక్షత ప్రతీ ఫ్రేం లో కనిపిస్తుంది .
విశ్లేషణ : కొత్త కుర్రాడు ఐనప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అన్ని ఎమోషన్లు పలికించాడు శ్రీనివాస్ . వినాయక్ వంటి అగ్ర దర్శకులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం ఖాయం ఐతే కథ, కథనం పాతదే అయినా వినసొంపుగా ఉన్న పాటలకు అద్భుతమైన లోకేషన్లు తోడవడం దానికితోడు వినోదాన్ని మేళవించి రంగరించడంతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమనే చెప్పాలి ఐతే అది ఏ రేంజ్ అన్నది మాత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తే అంత పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
0 comments:
Post a Comment